డేరింగ్‌ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌, షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోహీరోయిన్లుగా ప్రముఖ ఛాయాగ్రహకుడు కె.వి. గుహన్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై యంగ్‌ ప్రొడ్యూసర్‌ మహేష్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. మార్చి 1న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా యంగ్‌ ప్రొడ్యూసర్‌ మహేష్‌ ఎస్‌. కోనేరుతో ఇంటర్వ్యూ.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– ఇంతకుముందు కల్యాణ్‌రామ్‌గారు చేసిన సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించాను. ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌గారితో మరో సినిమా చేద్దామనుకుంటున్న సమయంలోనే గుహన్‌గారు కల్యాణ్‌రామ్‌గారికి స్టోరి చెప్పడం జరిగింది. ఆయన యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌లో నిర్మిద్దామనుకున్నారు. ఓ సందర్భంలో ఆ కథని నాకు చెప్పారు. చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చడం, ఎప్పటి నుండో ఇలాంటి ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని మా బేనర్‌లో నిర్మించాలనే కోరికతో ఈ సినిమాని నేనే నిర్మిస్తాను అని కల్యాణ్‌రామ్‌గారికి చెప్పడం జరిగింది. అలా ఆయన యాక్సెప్ట్‌ చెయ్యడంతో ‘118’ స్టార్టయ్యింది.

118ని మంచి స్లాట్‌ చూసుకుని రిలీజ్‌ చేయాలని ముందే అనుకున్నారా?
– గతేడాది దసరాకు విడుదల చేయాలని అనుకున్నాం. కానీ అప్పుడు పెద్దాయన ఎన్టీఆర్‌ బయోపిక్‌లో హరిక ష్ణగారి పాత్రను కల్యాణ్‌రామ్‌గారు చేయాల్సి వచ్చింది. అది పెద్ద ప్రాజెక్ట్‌, ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ కావడంతో డేట్లు వాళ్లకు ఇవ్వాల్సి వచ్చింది. మా చిత్రంలో కల్యాణ్‌గారు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తారు. ఒక్కసారి ఆ సినిమా షెడ్యూల్‌కు వెళ్తే మళ్లీ లుక్‌ పరంగా మాకు ప్రిపేర్‌ కావడానికి టైమ్‌ పట్టేది. ఆ తర్వాత మేం మళ్లీ డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నాం. కానీ అప్పటికీ కాకపోవడంతో ఈ మధ్య విడుదల చేశాం. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ‘పటాస్‌’లాంటి భారీ కమర్షియల్‌ హిట్‌ మూవీ ఉన్నప్పటికీ నటన పరంగా ఆయనలోని పూర్తిస్థాయి నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశాను అనే సంతృప్తి ఉంది. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో ‘118’ మెమొరబుల్‌ సినిమాగా నిలిచింది.

గుహన్‌ మేకింగ్‌ స్టైల్‌ ఎలా అన్పించింది?
– గుహన్‌గారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు పని చేశారు. ఆయన ఈ కథను తన డ్రీమ్‌గా భావించి రాసుకోవడం జరిగింది. గుహన్‌లాంటి ఒక బ్రిలియంట్‌ టెక్నీషియన్‌ తప్పకుండా ఈ కథకి పూర్తి న్యాయం చేస్తారని నేను ముందునుండి భావిస్తూ వచ్చాను. గుహన్‌గారు కూడా ఈ కథను ఛాలెంజింగ్‌గా తీసుకొని మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. నిర్మాణ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో సినిమాని నిర్మించాం.

జర్నలిస్ట్‌గా ఎన్నో సినిమాలకు సమీక్షలు రాసిన మీకు ప్రొడ్యూసర్‌గా ఎలా అన్పిస్తోంది?
– నేను చాలాకాలం జర్నలిస్ట్‌గా పని చేయడం జరిగింది. ఆ సమయంలో ఎన్నో సినిమాలకు రివ్యూస్‌ రాశాను. జర్నలిస్ట్‌గా ఎన్నో సినిమాలకి నావంతు సపోర్ట్‌గా నిలబడ్డాను. అయితే ఇప్పుడు నేను నిర్మించిన సినిమాకి జర్నలిస్ట్‌లందరూ పాజిటివ్‌ రివ్యూస్‌ రాసి సపోర్ట్‌గా నిలవడం చాలా హ్యాపీగా అన్పించింది.

‘118’ సినిమాకి ఏమైనా సజెషన్స్‌ ఇచ్చారా?
– అవునండీ. సినిమా ఇంటర్వెల్‌ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌ని నేనే సజెస్ట్‌ చేయడం జరిగింది. గుహన్‌గారు కూడా పాజిటివ్‌గా తీసుకొని తన క్రియేటివిటీతో చాలా బాగా తీశారు.

నివేదా థామస్‌ గురించి?
– ఈ సినిమా కథ వినగానే కల్యాణ్‌రామ్‌గారి తర్వాత మేం అనుకున్న ఫస్ట్‌ క్యారెక్టర్‌ నివేదానే. ఈ విషయం ఇంతవరకు ఆమెకు తెలియదు. ఈ సినిమాకు నివేదా పెర్‌ఫార్మెన్స్‌ చాలా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి, ఫ్యాబులస్‌ పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ నుండి అద్భుతమైన అప్లాజ్‌ వచ్చింది.

శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ సినిమాకి ఎంతవరకు హెల్ప్‌ అయ్యింది?
– సాధారణంగా థ్రిల్లర్‌ సినిమాలకి మ్యూజిక్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర సూపర్బ్‌ మ్యూజిక్‌తో పాటు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్ళారు.

తారక్‌, కల్యాణ్‌రామ్‌లతో మీకు స్పెషల్‌ బాండింగ్‌ ఉంటుంది కదా! దాని గురించి?
– రామారావుగారు సినిమాల్లోకి రాకముందు నుండే వాళ్ళ కుటుంబ సభ్యులతో మా కుటుంబ సభ్యులకు మంచి అనుబంధం ఉండేది. తర్వాత నేను జర్నలిస్ట్‌గా సినిమా రంగంలోకి వచ్చాక వారితో పరిచయం ఏర్పడింది. ఒక అభిమానిగా వారు నాకు సపోర్ట్‌ చేస్తూ వచ్చేవారు. అలా వారితో నాకు మంచి బాండింగ్‌ ఏర్పడింది.

‘118’ సినిమా చూసి తారక్‌ అభినందించడం ఎలా అన్పించింది?
– మనం ఒక సినిమా తీసిన తర్వాత మనకి ఎలాగూ నచ్చుతుంది. కాబట్టి థర్డ్‌ పర్సన్‌ ఒపీనియన్‌ తీసుకుందామనే ఉద్దేశంతో మా వెల్‌ విషర్‌ అయిన తారక్‌గారికి సినిమా చూపించడం జరిగింది. ఆయన సినిమా చూసి ‘సినిమా చాలా బావుంది. ఫస్ట్‌హాఫ్‌, సెకండాఫ్‌ కొత్తగా ఉంది. తప్పకుండా ఆడియన్స్‌కి కనెక్ట్‌ అవుతుంది’ అని ధైర్యమిచ్చారు. ఆ ధైర్యంతోనే దిల్‌ రాజు, శిరీష్‌గార్లకు సినిమా చూపించడం జరిగింది. వారు కూడా సినిమా చూసి మా సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేశారు. వాళ్ళ సపోర్ట్‌తో రిలీజ్‌ అవ్వడం వల్లనే మా సినిమాకు ఇంత పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

కీర్తి సురేష్‌ సినిమా ఎంతవరకు వచ్చింది?
– మా బేనర్‌లో కీర్తి సురేష్‌ మెయిన్‌ లీడ్‌గా సినిమా స్టార్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వచ్చేవారం నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా లీడ్‌ క్యాస్ట్‌ అంతా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మేలో యు.ఎస్‌. షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాం. యు.ఎస్‌.లో 40 రోజులు షూట్‌ చేస్తాం. ఈ సంతవ్సరం సెకండాఫ్‌లో ఈ చిత్రం రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
– మా బేనర్‌లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమాని ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చే న్యూ టాలెంటెడ్‌ పర్సన్స్‌ని ఎంకరేజ్‌ చేయాలనే ఉద్దేశంతో హరీష్‌శంకర్‌గారు, నేను కలిసి సినిమాలు నిర్మించబోతున్నాం. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాం.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు మహేష్‌ ఎస్‌ కోనేరు.