ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం `ప్యార్ ప్రేమ కాదల్`. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా – విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ రాజా స్వ‌యంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. ‘ప్యార్ ప్రేమ కాద‌ల్’ చిత్రంతో యువ‌న్ నిర్మాత‌గా మారుతున్నందుకు ఆయ‌న‌కు ఆశీస్సులు అందించిన చిరంజీవి యువ‌ర‌క్తం ప‌రిశ్ర‌మ‌కు రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ…’40 ఏళ్ల క్రితం మెగాస్టార్‌తో `మొగుడు కావాలి` సినిమా తీశాను. నాన్న‌గారిపై కోపంతో చిరుకి ఫోన్ చేసి మ‌నం సినిమా చేయాలి అని అడిగాను. ఆ సినిమా క‌థేంటి.. ద‌ర్శ‌కుడెవ‌రు? అన్న‌ది కూడా అడ‌గ‌కుండా అంగీక‌రించారు మెగాస్టార్. చిరంజీవితో నా అనుబంధం వేరు. ఆయ‌న‌తో రెండు సినిమాలు చేశాను. వాటికి డ‌బ్బులే ఇవ్వ‌లేదు త‌న‌కి. అలా జ‌రిగిపోయాయి ఆ రెండు సినిమాలు.ఆ త‌ర్వాత చాలా కాలం సినిమాల ప‌రంగా మేం క‌లుసుకోలేదు. ఆ త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిని అవుతూ `అల‌జ‌డి` సినిమా చేస్తే నేను పిల‌వ‌కుండానే ఆయ‌న వ‌చ్చి స‌క్సెస్‌ పార్టీ ఇచ్చారు`. క‌న్న‌డ టీవీ షోస్ చేస్తుంటే ఒక అనాధ‌కు కంటి ఆప‌రేష‌న్ చేశారు. చిరంజీవి గారిని చూడాల‌న్న‌ది ఆ అమ్మాయి కోరిక‌. నేను చెప్ప‌గానే చిరంజీవి అక్క‌డికి వ‌చ్చారు. అదే రోజు `చ‌రిత చిత్ర` తొలి టీవీ షో ఓపెనింగుకి వ‌చ్చి సాయ‌మ‌య్యారు చిరంజీవి. ఆరోజు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవి వేరు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. యువ‌న్ శంక‌ర్ రాజా తొలి సారి నిర్మాత‌గా రూపొందించిన `ప్యార్ ప్రేమ కాద‌ల్` చిత్రాన్ని బాగా న‌చ్చి రిలీజ్ చేస్తున్నాం. 12 పాట‌లు ఉన్న చిత్ర‌మిది. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు“ అని తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవిని క‌ల‌వ‌డం సంతోషంగా ఉంది. చిరంజీవి గురించి ఒక మాట‌ చెప్పాలి. చిరంజీవికి సినిమా అంటే పిచ్చి. నా తొలి సినిమా `కోత‌ల‌రాయుడు`కి డ్యాన్స్ మాష్ట‌ర్లు, ఫైట్ మాష్ట‌ర్లు లేరు. ఆయ‌నే ఫైట్ మాస్ట‌ర్. ఆయ‌నే డ్యాన్స్ మాష్ట‌ర్. నేను నిర్మించిన‌ `మొగుడు కావాలి` టైమ్‌లో 47రోజుల ఫారిన్ షెడ్యూల్ ఉంది. ప్యారిస్ వెళ్లాలి. షెడ్యూల్స్ వేస్ట్ కాకూడ‌ద‌ని ఎంతో రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ చేశారు.40 ఏళ్ల నుంచి ఆయన మెగాస్టార్ ఎందుక‌య్యారు అంటే ఇంత క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే… అని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తెలిపారు.

యువ‌న్ శంక‌ర్ రాజా మాట్లాడుతూ-“మెగాస్టార్ ఆశీస్సుల‌తో ఈ సినిమా రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. నిర్మాత‌గా తొలి ప్ర‌య‌త్నం ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. అంద‌రి ఆద‌ర‌ణ కావాలి“ అన్నారు.

నిర్మాత విజ‌య్ మోర్వ‌నేని మాట్లాడుతూ-“త‌మిళ్‌లోలానే తెలుగులోనూ విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. చ‌క్క‌ని కంటెంట్ ఉన్న సినిమా ఇది“ అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -“టీజ‌ర్ లాంచ్‌కి అంగీక‌రించ‌డానికి కార‌ణం . భ‌ర‌ద్వాజ‌, విజ‌య్‌, యువ‌న్‌లే. త‌మ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జ‌న‌రేష‌న్ గ్యాప్ ఉన్నా యువ‌న్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవ‌రెట్ సంగీత ద‌ర్శ‌కుడు అత‌డు. 80ల‌లో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వ‌డం వ‌ల్ల‌నే త‌నంటే ఇంత ఇష్టం. త‌ను ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ నిర్మాత‌గా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అని అనుకుంటున్నా. ఇది హిట్టేన‌ని భావిస్తున్నా. ఇక మా అసోసియేష‌న్ విజ‌య్ సోద‌ర స‌మానుడు. అలానే యువ‌ప్ర‌తిభ ప‌రిశ్ర‌మ‌కు రావాలి. వారి సినిమాల్ని ప్రోత్స‌హించ‌డం నా బాధ్య‌త‌గా భావిస్తాను. ఏ భాష‌లో సినిమా అయినా బావుంటే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు చూడాలి. అలా త‌మిళంలో హిట్టయిన ‘ప్యార్ ప్రేమ కాద‌ల్’ తెలుగులోనూ హిట్ట‌వుతుంద‌ని అన‌కుంటున్నా. చ‌క్క‌ని యూత్‌ఫుల్‌ సినిమా ఇదని అర్థ‌మవుతోంది. పెద్ద విజ‌యం అందుకోవాలి. నాయ‌కా,నాయిక‌ల‌కు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.

కళాశాల నేపథ్యంలో సాగే ‘ప్యార్ ప్రేమ కాదల్’

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి ‘ప్యార్ ప్రేమ కాదల్’ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.. ఎలన్ డైరెక్షన్ లో హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం కళాశాల నేపథ్యంలో జరిగే ప్రేమకథ. ఎలన్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్ర కధ, ప్రేమ లోని భావోద్వేగాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తాయి.చిత్రానికి, పాటలు, నేపధ్య సంగీతం అద్భుతంగా అందించారు యువన్ శంకర్ రాజా. ఈ ప్యార్ ప్రేమ కాదల్ తెలుగు నాట కనువిందు చెయ్యడానికి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

సమర్పణ:తమ్మారెడ్డి భరద్వాజ.
ప్రొడ్యూసర్స్:యువన్ శంకర్ రాజా,విజయ్ మోర్వనేని
.మ్యూజిక్:యువన్ శంకర్ రాజా. 0.3210
దర్శకత్వం :ఎలన్