కింగ్ నాగార్జున‌, నాచురల్ స్టార్ నాని, ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా హీరో హీరోయిన్లుగా వైజ‌యంతీ మూవీస్, వయాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌ ప‌తాకాల‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మెగా మేకర్ సి.అశ్వినీద‌త్ నిర్మించిన చిత్రం `దేవ‌దాస్‌`. ఈ నెల 20న ఆడియో విడుద‌ల‌వుతుంది. సినిమా ఈ నెల 27న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ మీడియా తో మాట్లాడారు….

* నిర్మాత‌గా ఇది నాకు 45వ చిత్రం. ఒక‌ప్పుడు నాలుగైదు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ‌లో దేవ‌దాస్ వంటి మ‌ల్టీస్టార‌ర్ రావ‌డం ఆనందంగా ఉంది. సెప్టెంబ‌ర్ 20న అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా దేవదాస్ ఆడియో విడుద‌ల చేస్తున్నాం. అలాగే సెప్టెంబ‌ర్ 27న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. స్వ‌ప్న‌, ప్రియాంక ఆధ్వర్యంలో తెలుగులోనే కాదు.. వేరే భాష‌ల్లో కూడా సినిమాలు చేయాల‌నుంది. కలకత్తా మెయిల్‌, కంపెనీ త‌ర్వాత హిందీ సినిమాల నిర్మాణం చేయ‌లేదు. నాగ్ అశ్విన్ కూడా హిందీలో సినిమాలు చేయాల‌ని ఆస‌క్తిగా ఉన్నారు. కాబ‌ట్టి హిందీ రంగంలో అడుగుపెట్టాల‌ని ఆస‌క్తిగా ఉన్నాం. ఇతర భాషల్లో చిత్రాలని నిర్మిచడం కోసం వ‌యాకామ్ మోష‌న్ పిక్చ‌ర్స్ 18 సంస్థ మాకు పార్ట్‌న‌ర్‌గా ఉంటుంది. అలాగే త‌మిళంలో కూడా సినిమాలు చేయాల‌నుంది. వైజ‌యంతీ మూవీస్ ప్లాట్‌ఫామ్‌ను తిరిగి కొద్దిగా పెంచాల‌ని స్వ‌ప్న‌, ప్రియాంక‌లు ఆలోచిస్తున్నారు.

* `దేవ‌దాస్‌` గురించి చెప్పాలంటే నాకు మంచి మిత్రుడు శ్రీధ‌ర్ చెప్పిన లైన్ బాగుంద‌ని అనిపించ‌డంతో సినిమా చేద్దామ‌ని అనుకున్నాం. భూప‌తిరాజా ఆ క‌థ‌కు మంచి స్క్రిప్ట్‌ను అందించారు. శ్రీరామ్ ఆదిత్య చ‌క్క‌గా స్క్రీన్ ప్లే , ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీరామ్ ఆదిత్య సినిమాను చ‌క్క‌గా హ్యాండిల్ చేశాడు. స్నేహం గురించి గొప్ప నిర్వ‌చ‌నం ఈ సినిమాలో ఇచ్చాం. అలాగే సాయిమాధ‌వ్ బుర్రాగారు గొప్పగా డైలాగ్స్ రాశారు. మా సంస్థ ద్వారా ఇంట్ర‌డ్యూస్ అయిన మ‌ణిశ‌ర్మ‌గారు మాతో చేసిన 17వ సినిమా ఇది. చాలా చ‌క్క‌టి సంగీతాన్ని అందించారు. పాట‌లు, నేప‌థ్య సంగీతంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న విశ్వ‌రూపం చూపించాడు. రెండున్న‌ర గంట‌లు సినిమా వినోదాత్మ‌కంగా ఉంటుంది.

* లైన్ సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత డైరెక్ట‌ర్ ఎవ‌ర‌ని మూడు నెల‌లు వెయిట్ చేశాం. చివ‌ర‌కు శ్రీరామ్ ఆదిత్య అయితే బావుంటుంద‌నిపించింది. త‌న ద‌ర్శ‌క‌త్వంలో భ‌లేమంచిరోజు, శ‌మంత‌క మ‌ణి చిత్రాల‌ను చక్క‌గా డైరెక్ట్ చేశాడు. శ‌మంత‌క మ‌ణి సినిమా స‌మ‌యంలో ఈ సినిమాకు డైరెక్ట‌ర్ త‌న‌ని ఎంపిక చేశాం. ఈ స్టోరీ డెవ‌ల‌ప్ చేసే క్ర‌మంలో త‌ను చాలా కష్టపడ్డాడు . భిన్న దృక్పథాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. అలనాటి గుండమ్మ కథ తరహాలో ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది.

* నాగార్జున‌గారితో `అజాద్‌` త‌ర్వాత నేను సినిమా చేయ‌లేదు. ఈ గ్యాప్‌లో నేను అబ్జ‌ర్వ్ చేసింది.. అంత‌కు ముందు నాగార్జున‌గారంటే 9,9.30కి వ‌చ్చి మ‌ల్లెపువ్వులాగా, ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేవారు. కానీ ఇవాళ నాగార్జున‌గారిలో ఉన్న ఇన్వాల్వ్ మెంట్ చూస్తే నేను షాక్ అయ్యా.ఒకప్పుడు కథ, కథనాల నుంచి చిత్రీకరణ వరకు అన్ని విభాగాలపై ఎన్టీఆర్ దృష్టిసారించేవారు. అలాంటి ఆలోచనా విధానం ప్రస్తుతం నాగార్జునలో కనిపిస్తున్నది. నాగార్జున‌గారూ, నానిగారూ అద్భుతంగా చేశారు. వాళ్ల‌ను చూస్తే చాలా కొత్త‌గా అనిపించింది.

* వైజ‌యంతిలో చిరు 4, నాగ్ 4, కృష్ణ‌గారు 4 సినిమాలు చేశారు. ఇప్పుడు `దేవ‌దాస్`తో నాగార్జున‌గారు 5వ సినిమా కూడా చేశారు. సో మా సంస్థ‌లో ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయ‌నే.

* ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి గొప్ప నటులతో వైజయంతి మూవీస్ ప్రారంభమైంది. అలాంటి సంస్థ ద్వారా మహానటి సావిత్రి జీవితాన్ని చెప్పే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. స్వ‌ప్న సినిమా, వైజ‌యంతీ మూవీస్ క‌లిసి చేసిన సినిమా `మ‌హాన‌టి`. ఆ సినిమా తీసినందుకు ప్ర‌తి ఒక్క‌రికీ చాలా గొప్ప‌గా అనిపించింది. ఇప్పుడు వైజ‌యంతీ మూవీస్ ఫార్ములాలో మేం `దేవ‌దాస్‌`ను తీశాం. మా సంస్థ ప్ర‌తిష్ట‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంది.

* నాగ అశ్విన్ తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది . అలాగే మ‌రో గొప్ప ద‌ర్శ‌కుడు… నాకెంతో ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు అట్లీతో జ‌న‌వ‌రి నుంచి మ‌రో సినిమా మొద‌లుపెడ‌తాం. తార‌క్‌తో ఓ సినిమా ఉంది. విజ‌య్ దేవర‌కొండ‌తో రెండు సినిమాలున్నాయి. విజ‌య‌దేవ‌ర‌కొండ‌తో తీసే తొలి సినిమాను రాజ్‌,డి.కె డైర‌క్ట్ చేస్తారు. స్వ‌ప్న సినిమాలో నాగి ఎవ‌రితో తీస్తార‌నేది ఇంకొన్ని రోజుల్లో చెబుతాం.

* సెప్టెంబ‌ర్ లాస్ట్ వీక్ మా సంస్థ‌కు బాగా క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. ఇన్నేళ్ల నా సినిమా జ‌ర్నీలో చాలా తృప్తి ఉంది. చాలాఇళ్ల‌ల్లో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద వాళ్ల లాగా నా పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అది నేను సాధించిన ఘ‌న‌త‌గా భావిస్తున్నాను. అది చాలా గొప్ప థ్రిల్. నేను ఇంత స్టేజ్‌కి వ‌స్తాన‌ని కానీ, ఇన్ని ప్రెస్టీజియ‌స్ సినిమాలు చేస్తాన‌ని కానీ ఎప్పుడూ అనుకోలేదు. కాక‌పోతే నా సినిమాలు విడుద‌లైన‌ప్పుడు మాత్రం నా పేరు చెప్పుకోవాల‌ని మాత్రం ఉండేది. రెండు దెబ్బ‌లు మ‌ధ్య‌లో త‌గిలాయి. అప్పుడు కాస్త తేరుకుని మ‌నమే క‌దా తీయ‌గ‌లం.. మ‌న‌మే తీయాలి అని నా భార్య వెనుక నుంచి ఎప్పుడూ చెబుతూ ఉండేది. పోతే పోతాయి.. మ‌ళ్లా క‌ష్ట‌ప‌డ‌దాం. నువ్వు త‌ప్ప మంచి సినిమాలు ఎవ‌రు చేయ‌గ‌ల‌రు? అని ఎంకరేజ్ చేస్తా ఉండేది. పిల్ల‌లు ముగ్గురూ అమెరికా వెళ్లి చ‌దువుకుని వ‌చ్చినా పెద్ద వాళ్లు ఇద్ద‌రూ ఈ రంగంలోనే ఉన్నారు. అది చాలా గ‌ర్వంగా అనిపిస్తుంటుంది.

* నా 21లో ఎన్టీఆర్‌గారితో సినిమా చేశా. 20 ఎండింగ్‌లో విశ్వనాథ్ గారితో ఓ సీత‌క‌థ చేశా. దీన్ని కూడా వ్యాపారంగానే ఎంచుకుని ఈ రంగానికి వ‌చ్చాను కాబ‌ట్టి ఇష్టంగా చేశా. నేను డ‌బ్బులుగా అయితే ఆ రోజు మా నాన్న‌గారు 1973లో తీసుకు వ‌చ్చిన‌దానికి టీ.న‌గ‌ర్‌లో స్థ‌లాలు కొని ఉంటే కోట్లాధిప‌తిని అయి ఉండేవాడిని. డ‌బ్బు ప‌రంగా ఆ రోజు నేను తెచ్చిన‌దానికి, ఇప్పుడున్న దానికీ బ్యాల‌న్స్ షీట్ చూసుకోకూడ‌దు. కీర్తి ప్ర‌తిష్ట‌ల ప‌రంగా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను తాత‌ల‌తో తీశా. తండ్రుల‌తో తీశా. మ‌న‌వ‌ళ్ల‌తో తీశా. ఇంకా తీస్తా. ఇప్పుడు 45 ఏళ్లుగా ఉన్నా.. ఇంకా 100 ఏళ్లు నా పిల్ల‌లు దీన్ని న‌డుపుతారు. మా సంస్థ‌కు ఓ రోజు తెల్లారుజామున ఎన్టీరామారావుగారు వైజ‌యంతీ మూవీస్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆపేరు బ‌లంతో వందేళ్లు త‌ప్ప‌కుండా ఉంటుంది మా సంస్థ‌.  వందేళ్ళ పాటూ వైజయంతి మూవీస్ సంస్థ ఉండాలన్నది నా ధ్యేయం.

* స్వ‌యంకృషి అనేది లేక‌పోతే ఏమీ చేయ‌లేం. అది కావాలి. కానీ, మ‌న‌కంటే ఇంకా గొప్ప‌గా క‌ష్ట‌ప‌డేవాళ్లు, మ‌న‌క‌న్నా గొప్ప‌గా ఆలోచించ‌గ‌లిగిన వాళ్లు.. చాలా మంది ఉన్నారు. ఇంత పోయింది.. అంత పోయింది అని అనుకున్న‌ప్పుడు ప‌క్క‌న కొంద‌రిని చూస్తే వాళ్లు ఇంకా ఎంతో పోగొట్టుకున్నారు. అందుకే నాకు తెలిసి సినిమా రంగంలో అదృష్టం అనేది త‌ప్ప‌కుండా క‌లిసి రావాలి. ఇక్క‌డ టాలెంట్ మాత్ర‌మే స‌రిపోదు అని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తా.

* వంద కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ అనేది కాల‌మాన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పెట్ట‌క త‌ప్ప‌డం లేదు. కానీ స‌క్సెస్ రేట్ మాత్రం పెర‌గ‌క‌పోతే చాలా క‌ష్టం. నేను ఇండస్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడున్న 10 శాతం స‌క్సెస్ రేటే ఇప్పుడూ ఉంటే చాలా కష్టం . కాక‌పోతే ఇవాళ నిర్మాత‌ల‌కి వ‌రంలాగా టీవీ, ఎల‌క్ట్రానిక్ మీడియా, ఓవ‌ర్సీస్ రైట్స్ పెరిగాయి కాబ‌ట్టి పెద్ద‌గా రిస్క్ అనిపించ‌డం లేదు.

* ఎదురులేని మ‌నిషి అప్పుడు ఎంత‌యిందో నాకు గుర్తులేదు. అప్పుడు 16. 15ల‌క్ష‌ల్లో అయిన‌ట్టుంది. అదే ఇప్పుడైతే కోట్ల మీదే. నేను స్వ‌ప్న‌ని `మ‌హాన‌టి`కి ఎంతవుతుంద‌ని అడిగా. రూ.16-17కోట్ల‌వుతుంద‌ని అన్న‌ది. కానీ అది ఎక్కువనుకున్నా. అయినా సావిత్రి మీద కాబట్టి `ఫ‌ర్వాలేదు. గ్రాఫిక్స్ ద‌గ్గ‌ర, సెట్స్ ద‌గ్గ‌ర కాంప్ర‌మైజ్ కావ‌ద్దు` అని అన్నా. ఆఖ‌రికి అది రూ.29కోట్ల‌యింది. క్వాలిటీ వంటివ‌న్నీ చూసిన‌ప్పుడు అది అంతే అయింది. దాన్ని ఏమీ చేయ‌లేం.

* స్వ‌ప్న సినిమాలో మా విజ‌య‌దేవ‌ర‌కొండ సినిమా ఉంటుంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ సినిమా చేయాలంటే రాజ‌మౌళి సినిమా పూర్తవ్వాలి క‌దా.

* అప్ప‌ట్లో విజ‌య ప్రొడ‌క్ష‌న్స్, ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తి అధినేత, ఆ త‌ర్వాత రామానాయుడు.. అలా భారీగా తీసేవాళ్లు. కానీ ఇవాళ అంద‌రూ భారీగానే చేస్తున్నారు. 100లో 90 మంది భారీగా తీస్తున్నారు. భారీగా తీస్తున్నామా, మామూలుగా తీస్తున్నామా అనే సంగ‌తి తీసే నిర్మాత‌ల్లో 90 శాతం మందికి తెలియ‌దు.