విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా చిత్ర హీరో విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు.

*పెళ్లిచూపులు నుండి అంతా చాలా త్వరగా జరిగిపోయింది. రోడ్ లో వెళ్తున్నప్పుడు నా పోస్టర్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి కెరీర్ ఎటు తీసుకెళ్తే అటు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నా.

*తప్పులు చేస్తానేమో అని భయపడను. అవి సహజం. నా నిర్ణయాల వల్ల తప్పులు జరిగితే ఆ పర్యవసానాలని ఎదుర్కుంటాను. వేరే వాళ్ళ తప్పుల ప్రభావం నా మీద పడటం ఇష్టముండదు.

*క్లోతింగ్ లైన్ పెట్టాలని చిన్నప్పటి నుండే ఉండేది. యాక్టర్ అవడం వల్ల ఈ ఫాలోయింగ్ రావడం వల్ల ఆ ఆలోచనను ని వాస్తవరూపం లోకి తీసుకురాగలిగాను.

*పాడటం ఇష్టం. పాడటాన్ని సీరియస్ గా తీసుకోకపోయినా సింగర్స్ అన్నా, పాప్ స్టార్స్ అన్నా ఒక ఫాసినేషన్. కానీ పాడటాన్ని ఎప్పుడు నేర్చుకోలేదు. ‘వాట్ ది ఎఫ్’ పాటని నా సామర్ధ్యం మేర పాడాను. జనాలకి నచ్చలేదు. దానికి నేనేమి బాధపడలేదు. అది వాళ్ళ అభిప్రాయం. వేరే సింగర్ తో పాడించాం. ఇక్కడి థియేటర్ లలో వేరే సింగర్ వాయిస్ ఉంటుంది. రికార్డింగ్ అయ్యేలోపే ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్లిపోయాయి కాబట్టి ఆ ప్రింట్స్ లో నా వాయిస్ లో ఆ పాట ఉంటుంది.

*గోవింద్, అర్జున్ లో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే తాము ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కానీ అందు కోసం వారు ఎంచుకునే మార్గం, స్వభావం పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

*ఈ సినిమా విజయం, నా పెర్ఫార్మన్స్ క్రెడిట్ మొత్తం దర్శకుడు పరశురామ్ కే ఇస్తాను. ఆయన్ని అబ్సర్వ్ చేస్తూ ఫాలో అయిపోయాను. ఆడియన్స్ కి నా పెర్ఫార్మన్స్ నచ్చితే ఆ క్రెడిట్ అంతా ఆయనదే.

*ఈ సినిమా చేయడానికి కారణం బన్నీ వాస్ గారు. నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచన లేదు. వాసు గారు కూర్చోపెట్టి ఈ తరహా సినిమాల వల్ల రీచ్ ఎక్కువుంటుంది అని చెప్పి చేయించారు. ఎడిట్ రూమ్ లో చూస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఎంత కరెక్టో అర్థమైంది. ‘గీత గోవిందం’ చూసి అన్ని వయసుల, వర్గాల ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు

*ఈ జానర్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘బొమ్మరిల్లు’, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’ సినిమాలంటే చాలా ఇష్టం.

*సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. చుసిన అందరు ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. సంవత్సరం నుండి అందరం పడిన కష్టం రేపు ప్రేక్షకుల ముందు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుంది.

*టాక్సీవాలా కి గ్రాఫిక్ వర్క్ చాలా ముఖ్యం. ఆ వర్క్ జరగాల్సి ఉంది. ఈ లోపు ‘గీత గోవిందం’ పూర్తి అయిపోయింది. అరవింద్ గారు, అందరు ఎదో త్వరగా చేసేసి రిలీజ్ చేయకుండా టైం తీసుకుని పర్ఫెక్ట్ గా చేయండి అన్నారు. అలా ‘గీత గోవిందం’ ముందుకి వచ్చింది. టాక్సీవాలా కచ్చితంగా బావుంటుంది.

*ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి క్రాంతి మాధవ్ గారి దర్శకత్వంలో కెయస్ రామారావుగారి బ్యానర్ లో సినిమా ఉంటుంది.