‘భరత్ అనే నేను’ తో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ చిత్రం ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చెప్పిన సంగతులు మీకోసం…

చెప్పండి శివగారు.. ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ?
అంటే.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లే ఏర్పాట్లలో ఉన్నాను. ఈ లోపల ప్రమోషన్లలో భాగంగా మరొక్కసారి సినిమాను ఇంతటి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.

అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కదా ఎలా ఉంది ?
చాలా బాగుంది. సినిమా విడుదలైతే హిట్ అవుతుంది లేకపోతే మంచి అప్రిసియేషన్ వస్తుంది. కానీ ఈ సినిమాకి విజయంతో పాటి ప్రసంశలు కూడ దక్కుతున్నాయి. అది నాకు చాలా సంతోషాన్నిస్తోంది.

ఈ సినిమా చేసేటప్పుడే ఇలాంటి అప్రిసియేషన్ రావాలని చేశారా ?
లేదు. సినిమా అనేది బిజినెస్ కాబట్టి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత పెడుతున్నారు, సినిమా ఎంత మందికి రీచ్ అవుతోంది, ఎంత మొత్తం వెనక్కి వస్తుంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకునే సినిమా చేస్తాను. మిగతావన్నీ అదనపు బోనస్ లాంటివి.

ఇప్పటివరకు మీకందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ?
కేటీఆర్ గారు సినిమా చూశాక నాకు ఫోన్ చేసి సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ఒక సామాజిక అంశాన్ని డీల్ చేసేప్పుడు ఏమాత్రం పొరపాటు జరిగినా అది డాక్యుమెంటరీ అయిపోతుంది. కానీ మీరు మాత్రం కమర్షియల్ అంశాలని, సోషల్ పాయింట్ ను బాగా డీల్ చేశారు అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.

ఇంకా ఇతర రాజకీయ నాయకులెవరైనా పొగిడారా ?
జయప్రకాష్ నారాయణగారు సినిమాలు చూడటం చాలా తక్కువ. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారు. అది కూడ మర్చిపోలేని కాంప్లిమెంట్. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల వాళ్ళు కూడ ఫోన్లు చేసి అభినందించారు.

ఈ సినిమా కోసం రాజకీయ నాయకులు ఎవరిదగ్గరైనా సలహాలు తీసుకున్నారా ?
సినిమాకు ముందు జయప్రకాష్ నారాయణగారిని కలిసి ఇలా సినిమా చేస్తున్నాను, సొసైటీలో మార్పులు రావాలంటే ఏం చేయాలి అని అడిగి ఈ లోకల్ గవర్నెస్ వంటి అంశాల గురించి ఆయనతో చర్చించడం జరిగింది.

ఏ వ్యక్తి జీవితాన్నైనా బయోపిక్ గా చేసే ఆలోచన ఉందా ?
కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని బయోపిక్ గా తీస్తే ఎక్కడో ఒక దగ్గర బోర్ కొడుతుంది. అందుకే కొంతమంది వ్యక్తుల జీవితాల్ని, వాటిలోని బలాల్ని కలిపి ఒక ఫిక్షన్ క్యారెక్టర్ తయారుచేసి సినిమా చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.

మహేష్ బాబుగారు నాకు క్లిష్టమైన సమయాల్లో హిట్లిచ్చిన శివకు థ్యాంక్స్ అని బహిరంగంగా అన్నారు. దాని పట్ల మీ ఫీలింగ్ ?
అది ఆయన గొప్పతనం. మహేష్ బాబుగారు ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశానికి మధ్యే వేరియేషన్ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది సినిమా సినిమాకు వేరియేషన్ తప్పకుండా చూపిస్తారు. ఆ క్రమంలో కొన్ని హిట్లి, ఇంకొన్ని ఫ్లాపులు సహజం.

పొలిటికల్ నేపథ్యంలో సినిమా తీసినా ఎలాంటి కాంట్రవర్శి లేకుండా చేశారు. ఎలా ?
ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి హిట్ కొట్టాలనే చీప్ మెంటాలిటీ కాదు నాది. అందుకే ఎవరనే నొప్పించకుండా జనాల్ని మోటివేట్ చేసేలా ఈ సినిమా చేశాను.

నిర్మాతగా మారుతానని చెప్పారు. ఎప్పుడు ?
అవును. నేను చేయలేని కథలను నేనే స్వయంగా కొత్తవాళ్లతో నిర్మించాలని అనుకుంటున్నాను. అది ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.