హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం “సవ్యసాచి”. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. “ప్రేమమ్” తర్వాత నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం) లు మాట్లాడుతూ.. “తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని “సవ్యసాచి” అంటారు. టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా మరియు నాగచైతన్య క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది. నాగచైతన్య మాస్ అప్పీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇండియా షూటింగ్ ఫినిష్ అయ్యాక అమెరికా వెళ్లనున్నాం. షూటింగ్ పూర్తి చేసి జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. కీరవాణి “బాహుబలి” తర్వాత సంగీతం అందించడంతోపాటు నేపధ్య సంగీతం కూడా సమకూరుస్తున్న చిత్రం “సవ్యసాచి” కావడం విశేషం” అన్నారు.

నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి(చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు మొండేటి.