‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ కంటే ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ పెద్ద హిట్‌ అవుతుంది – హీరో సప్తగిరి

0
342

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా నిర్మిస్తోన్న విభిన్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌ ఎల్‌బి’. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి, సాయికుమార్‌ కలిసి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

జయప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ – ”సప్తగిరి తక్కువ కాలంలోనే హాస్య నటుడిగా అందరినీ నవ్వించి హీరోగా ఎదిగిన వ్యక్తి. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో హీరోగా సక్సెస్‌ను సాధించి ఇప్పుడు ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఇందులో నేను మంచి పాత్ర చేశాను. నిర్మాత రవికిరణ్‌గారు డాక్టర్‌. వృత్తిరీత్యా ఆయనెంతో బిజీ అయినా, సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలను చేస్తున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ మాట్లాడుతూ – ”ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి సినిమా ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ‘ప్రస్థానం’, ‘సామాన్యుడు’ తర్వాత ఆ రేంజ్‌ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు నాకు నేనే కొత్తగా కనిపించాను. సప్తగిరి చాలా కమిట్‌మెంట్‌ ఉన్న హీరో. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేయడం వల్ల తనకు మంచి కథలను ఎన్నుకోవడంలో మంచి పట్టుంది. ప్రతిదీ కొత్తగా చేయాలని తపన పడుతుంటాడు. ఈ సినిమాలో కొత్త లుక్‌, స్టైలిష్‌గా కనపడతాడు. ప్రతి సీన్‌ ఛాలెంజింగ్‌గా అనిపించింది. రవికిరణ్‌గారు పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమాను నిర్మించారు. డైరెక్టర్‌ చరణ్‌తో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఎప్పుడో తను డైరెక్టర్‌ కావాల్సింది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడు. మంచి టీం కుదిరింది. అన్నీ ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇది. సినిమాలో ఈగోయిస్ట్‌ లాయర్‌ పాత్రలో నటించాను. సప్తగిరి ఈ సినిమాతో కామన్‌ మేన్‌కి చాలా దగ్గరవుతాడు” అన్నారు.

నిర్మాత రవికిరణ్‌ మాట్లాడుతూ – ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఏ సినిమా చేయాలని తర్జన భర్జనలు పడ్డాం. చాలా స్క్రిప్ట్స్‌ విన్నాం. ఏదీ నచ్చలేదు. ఆ సమయంలో హిందీలో విడుదలైన జాలీ ఎల్‌ఎల్‌బి సినిమా చూశాం..ఆ సినిమా ఎంతో నచ్చింది. భారీ రేటు ఇచ్చి సినిమాను సొంతం చేసుకున్నారు. మంచి మెసేజ్‌ ఉన్న సినిమా. ఈ సినిమాలో హెవీ క్యారెక్టర్‌ను సప్తగరి చక్కగా క్యారీ చేశాడు. సాయికుమార్‌గారు పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయన, సప్తగిరి ఇద్దరూ హీరోలుగా కనపడతారు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. 50 రోజుల్లో సినిమాను పూర్తి చేసాం. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. పెద్ద కోర్టు సెట్‌ వేసి సినిమాను పూర్తి చేశాం. విదేశాల్లో పాటలను షూట్‌ చేశాం. పరుచూరి బ్రదర్స్‌గారు తమ డైలాగ్స్‌తో సినిమాకు ప్రాణం పోశారు. డైరెక్టర్‌ చరణ్‌గారు సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సప్తగిరికి ఈ చిత్రం పెద్ద బ్రేక్‌ అవుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌” అన్నారు.

సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ”సప్తగిరి హీరోగా చేయడానికి సిద్ధమైనప్పుడు సప్తగిరి పని అయిపోయిందంటూ చాలా మంది పెదవి విరిచారు. అయినా సప్తగిరి హీరోగా సక్సెస్‌ అయ్యాడు. మంచి టాలెంట్‌ ఉన్న హీరో. కమర్షియల్‌ హీరోగా సప్తగిరి ఎదగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ – ”పరుగు సినిమాకు సప్తగిరి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ నటించాడు. అప్పటి నుండి మా మధ్య మంచి పరిచయం ఉంది. ప్రేమకథా చిత్రమ్‌తో కమెడియన్‌ ఎదిగిపోయాడు సప్తగిరి. తనకు కథలపై మంచి పట్టు ఉంది. ఈ సినిమాతో తను పెద్ద హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర దర్శకుడు చరణ్‌ మాట్లాడుతూ – ”డబ్బింగ్‌ కూడా పూర్తి చేసేశాం. సినిమా చాలా బాగా వచ్చిందని చూసిన వారందరూ అంటున్నారు. చెన్నైలో రీరికార్డింగ్‌ జరుగుతుంది. సాయికుమార్‌గారు సినిమాలో కీలకమైన లాయర్‌ పాత్రలో నటించారు. మేకింగ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కావద్దని నిర్మాత రవికిరణ్‌గారు మంచి టీంను సమకూర్చారు. సప్తగిరి మంచి విలువలున్న వ్యక్తి. పదేళ్ల కిత్రం నాతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం నాతో ఇప్పుడు సినిమా చేశాడు. మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ సభ్యుడు శివప్రసాద్‌ ఇందులో జడ్జ్‌ పాత్రలో నటించారు. సాయికుమార్‌, సప్తగిరి పోటాపోటీగా నటించారు” అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ – ”2009 నుండి సప్తగిరితో నాకు స్నేహబంధం ఉంది. సప్తగరి అనే బ్రాండ్‌ను సప్తగిరి క్రియేట్‌ చేసుకుంటున్నాడు. సప్తగిరి మిత్రుడుగా నేను సంతోషంగా ఉన్నాను. తను ఇంకా మంచిస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. టీజర్‌ చాలా బావుంది” అన్నారు.

హీరో సప్తగిరి మాట్లాడుతూ – ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఏ సినిమా చేయాలని నేను, రవికిరణ్‌గారు ఆలోచనలో పడ్డాం. అప్పుడు నేను ఓ సబ్జెక్ట్‌ చెప్పాను. అయితే అది భారీ బడ్జెట్‌ మూవీ. అంత బడ్జెట్‌ మూవీ వద్దని, వేరే సినిమా చేద్దామని అన్నారు. ఆ సమయంలో జాలీ ఎల్‌ఎల్‌బి సినిమా చూసి నచ్చడంతో ఫ్యాన్సీ రేటుతో హక్కులను దక్కించుకున్నారాయన. చరణ్‌ తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి సినిమాను చక్కగా తెరకెక్కించారు. నా మీద నమ్మకంతో ఈ సినిమా చేయగలవని నిర్మాతగారు ఈ సినిమాను చేయించారు. రవికిరణ్‌గారికి థాంక్స్‌. హిందీలో బొమన్‌ ఇరానీ చేసిన పాత్రను తెలుగులో సాయికుమార్‌గారు అద్భుతంగా చేశారు. సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ‘కంటే ‘సప్తగిరి ఎల్‌ ఎల్‌బి’ పెద్ద హిట్‌ కొడుతున్నామని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు.

హీరోయిన్‌ కశిష్‌ వోరా సహా చిత్ర యూనిట్‌ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సప్తగిరి, కశిష్‌ వోరా వర్మ, సాయికుమార్‌, డా.ఎన్‌.శివప్రసాద్‌, షకలక శంకర్‌, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, జయప్రకాష్‌ రెడ్డి, రవి కాలే తదితరులు నటించిన ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైనర్‌: విక్రమ్‌ డిజైన్స్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: బిక్షపతి తుమ్మల, డ్యాన్స్‌: విఘ్నేశ్వర్‌, రాజ్‌ పైడి, ఫైట్స్‌: విజయ్‌ , వెంకట్‌, నందు, జాషువా, ఆర్ట్‌: పి.ఎస్‌.వర్మ, ఎడిటింగ్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కందికొండ, సురేష్‌ బనిశెట్టి, లక్ష్మీ ప్రియాంక, మాటలు:పరుచూరి బ్రదర్స్‌, మూలకథ: సుభాష్‌ కపూర్‌, మ్యూజిక్‌: బుల్‌గానిన్‌, సమర్పణ:ఐశ్వర్య, సహ నిర్మాత: డా.కె.వాణి ఆర్‌.కె., నిర్మాత: డా. రవికిరణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here