సుకుమార్ సినిమా తీస్తున్నాడు. మిమ్మల్ని ఏ కార్యక్రమానికైనా పిలిచాడా? అని కొందరు మిత్రులు నన్నడిగారు. సుకుమార్ నన్ను పిలవకుండా ఎక్కడికి పోతాడు.. పిలుస్తాడు..అని వారితో సరదాగా అన్నాను. నాకు, సుకుమార్‌కు మధ్య ఆత్మీయ అనుబంధం వుంది. ఆయన నిర్మించిన దర్శకుడు పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానుదర్శకులందరిలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సుకుమార్. నేను ఐ లవ్ యూ చెప్పే ఇద్దరు ముగ్గురు మగాళ్లలో సుకుమార్ ఒకరు (నవ్వుతూ). సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా రిస్క్ చేయడం మామూలు విషయం కాదు. తన అభిరుచులకు అనుగుణంగా సుకుమార్ సినిమాల్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు అల్లు అర్జున్.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన దర్శకుడు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తితో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా, పూజిత జంటగా నటించారు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పై విధంగా స్పందించాడు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ బన్నీ నా వల్లే హీరో అయ్యాడు. ఆర్య షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ పడవ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి నేను నీళ్లలో పడిపోయాను. నాకు ఈత రాకపోవడం వల్ల ఏం చేయాలో అర్థంకాలేదు. ఓ నిమిషం ఆగితే చనిపోయేవాడిని. వెంటనే బన్నీ నీళ్లలో దూకి నన్ను రక్షించాడు. నన్ను రక్షించాడు కాబట్టి బన్నీని రియల్‌హీరోగా భావిస్తాను. నా దృష్టిలో అల్లు అర్జున్ ఎప్పటికే ఆర్యనే. ఇక మా కుటుంబ సభ్యుల్ని నేనెప్పుడు సినిమాల్లో ఎంకరేజ్ చేయలేదు. మా అన్నయ్య కుమారుడు అశోక్ అనుకోకుండాహీరో అయ్యాడు. దర్శకత్వ శాఖలో పనిచేయాలనేది అతడి లక్ష్యంగా వుండేది. వన్ సినిమాకు ఒక వెర్షన్ రాయమని పురమాయిస్తే అందరికంటే అద్భుతంగా రాశాడు. హీరోగా అతనికి మంచి భవిష్యత్తు వుంటుందని ఆశిస్తున్నాను అన్నారు.

సుకుమార్ నాకు సోదరుడితో సమానం. మా ఇద్దరికి పద్నాలుగేళ్ల అనుబంధం. ఆర్య చిత్రం నాతో పాటు అల్లు అర్జున్, సుకుమార్‌కు మంచి లైఫ్‌నిచ్చింది. దర్శకుడు సినిమా ట్రైలర్‌లో సుకుమార్ ముద్ర స్పష్టంగా కనబడుతున్నది. సినిమాను ఎంతగానో ప్రేమించే సుకుమార్ నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నాడు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని దిల్‌రాజు పేర్కొన్నారు.

సుకుమార్ ఆలోచనలకు అందమైన దృశ్యరూపంగా వుండే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. వినూత్న కథా చిత్రంలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నామని నాయకానాయికలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.