ఓ సినీ దర్శకుడు అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రేమను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటన్నదే దర్శకుడు చిత్ర ఇతివృత్తం అన్నారు చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా. స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రేక్షకులముందుకు రానుంది.

ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ నెల 29న అల్లు అర్జున్ అతిథిగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నాం అని చెప్పారు.

సుకుమార్ శైలిలో సాగే వినూత్న కథా చిత్రమిదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.

కథానుగుణంగా శ్రావ్యమైన బాణీలను అందించే అవకాశం లభించిందని, ఆడియో శ్రోతల ఆదరణ పొందటం ఆనందంగా వుందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ తెలిపారు.

ఈ తరహా కథతో ఇప్పటి వరకు సినిమా రాలేదని సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోల్ పేర్కొన్నారు. పాటలన్నీ నవ్యమైన బాణీలతో ఆకట్టుకుంటున్నాయని హీరో అశోక్ చెప్పారు.

అశోక్, ఈషా, పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.