ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మలయాళంలో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. తన మిత్రులతో కలిసి మలయాళంలో ‘కళ్యాణం’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్రారంభిస్తున్నారు. ప్రముఖ మలయాళ హీరో ముఖేష్‌ తనయుడు శ్రావణ్‌ ముఖేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజీవ్‌ నాయర్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 16న త్రివేండ్రంలోని మస్కట్‌ హోటల్‌లో ఉదయం 10 గంటలకు ‘కళ్యాణం’ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభోత్సవానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె.రాధామోహన్‌ తెలియజేస్తూ – ”రాజీవ్‌ నాయర్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందరూ మెచ్చే మంచి సినిమా అవుతుందన్న నమ్మకం కలిగింది. అందుకే ఈ చిత్రంతో మలయాళ రంగంలో అడుగు పెడుతున్నాను. హీరో ముఖేష్‌గారి అబ్బాయి శ్రావణ్‌ ముఖేష్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాము. వర్ష హీరోయిన్‌గా నటిస్తుంది” అంటూ ”నితిన్‌ హీరోగా మా బేనర్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నితిన్‌ సినిమా పూర్తి వివరాలు తెలియజేస్తాము” అన్నారు.

శ్రావణ్‌ ముఖేష్‌, వర్ష జంటగా నటిస్తున్న ‘కళ్యాణం’ చిత్రానికి నిర్మాత: కె.కె.రాధామోహన్‌, దర్శకత్వం: రాజీవ్‌ నాయర్‌.