ఎక్కడ చూసినా… ఏనోట విన్నా… ‘బాహుబలి-2’ గురించే టాక్‌. అంతలా ఈ చిత్రంపై క్రేజ్‌ ఏర్పడింది. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది. ఐదేళ్ల పాటు శ్రమించి ఎన్నో వేల మంది ఈ చిత్రానికి వర్క్‌ చేశారు. అందరి శ్రమకు తగిన ప్రతిఫలం ప్రేక్షకులు అందించారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక ధీరుడు యస్‌.యస్‌. రాజమౌళి ‘బాహుబలి-2’తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, గ్లామరస్‌ స్టార్స్‌ అనుష్క, తమన్నా కాంబినేషన్‌లో రానా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ నాజర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన అద్భుత సృష్టి ‘బాహుబలి-2’. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మించిన మోస్ట్‌ ఎవెయిటింగ్‌ మూవీ ‘బాహుబలి-2’. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్‌కి ఏప్రిల్‌ 28న అందరికీ సమాధానం దొరికింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా దర్శకధీరుడు యస్‌.యస్‌. రాజమౌళితో ‘సూపర్‌హిట్‌’ జరిపిన ఇంటర్వ్యూ.

మొదటి రోజు ఎంత వసూలు చేస్తుందనుకుంటున్నారు?
– ఎంత వసూలవుతుందో తెలీదు కానీ, కచ్చితంగా దేశంలోనే అత్యధిక వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. ఇది సమ్మర్‌ హాలిడే సీజన్‌. పోటీకి వేరే సినిమాలు కూడా లేవు. అందుకే.. మిగతా అందరిలాగే మేం కూడా బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుందని ఆశిస్తున్నాం.

మీకు ఇన్‌స్పిరేషన్‌ కలిగించిన చిత్రం ఏది?
– అతి చిన్న వయసులో నేను చూసిన ఫాంటసీ చిత్రం ‘మాయాబజార్‌’. అది నాపై తిరుగులేని ప్రభావం చూపించింది. ఆ సమయంలో ఆ సినిమా సాంకేతికతకి సంబంధించిన లోతుపాతులేవీ నాకు తెలియదు. కానీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మాత్రం ఆ సినిమాకి సంబంధించిన ప్రతిదీ అద్భుతంగా అనిపించింది. ఘటోత్కచుడిని ఎలా పెద్దగా చూపించారు? విశ్వరూపం అలా ఎలా చూపించారు? అని తెగ ఆలోచించేవాణ్ని. నేను, నా విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ కలిసి ఎంత సేపు ఆలోచించినా అప్పట్లో ఆ సన్నివేశాలు ఎలా చేశారో తెలియలేదు. అలాగే ఆ సినిమా ఆరంభంలో రెండు నిమిషాలు, మూడు చరణాలున్న ఒకే ఒక్క పాటలో బోలెడన్ని పాత్రల్ని పరిచయం చేశారు. అది ఇంకా ఆకట్టుకుంటుంది. ఒక దర్శకుడిగా ఆ సినిమా ప్రభావం నాపై చాలా ఉంది.

మీ గోల్‌ ఏమిటి?
– ఒక పెద్ద దర్శకుడు కావాలనేదే నా లక్ష్యం. అది తీరింది. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ‘మహాభారతం’. భారతీయ సినిమా అంటే ‘బాహుబలి’ అనే స్థాయిలో ప్రపంచం ద ష్టిని ఆకర్షించాను. ఆ విషయం నాకు చాలా గర్వంగా ఉంది. మహాభారతం సినిమా గురించి మరో పదేళ్ల తర్వాతే ఆలోచిస్తా. ఆ సినిమాని ఎలా తీయాలనే విషయంలో నా మనసులో ఉన్న ఆలోచనలకి తగ్గ సాంకేతికత, వనరులు ఇప్పుడు లేవు. తదుపరి ఏదైనా ఓ చిన్న కుటుంబ కథని తెరకెక్కించాలని ఉంది. కుటుంబంతో కలిసి భూటాన్‌ వెళ్లొచ్చాకే ఆ సినిమా గురించి ఆలోచిస్తాను.

‘బాహుబలి 2’కి క్యూలో టికెట్ల కోసం కిలోమీటర్ల పొడవున వేచి చూస్తుండడం కళ్లారా చూస్తుంటే ఓ దర్శకుడిగా ఏమనిపిస్తోంది?
– చిన్నప్పటి నుంచీ ఇలాంటి క్యూలు చాలా చూశాం, చూస్తున్నాం. భారీ అంచనాలతో ఎలాంటి సినిమా వచ్చినా సామాన్య ప్రేక్షకుడి నుంచి ప్రభుత్వాధికారుల వరకూ టికెట్ల కోసం డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఓ దర్శకుడిగా గర్వంగా ఉంది. కొంత భయం, మరికొంత బాధ్యత కూడా ఉంటుంది. ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే విషయం గుర్తుపెట్టుకొంటూ ఉంటా.

తొలి చిత్రంకంటే ‘బాహుబలి-2 ది కన్‌క్లూజన్‌’లో మార్పులేమైనా చేశారా?
– ఈ కథని ఒక భాగంలో చెప్పలేం కాబట్టి రెండు భాగాలుగా తీశాం కానీ, నా మనసులో ఉన్నది మాత్రం ఎప్పుడూ ఒకే కథే. తొలి భాగం విడుదలయ్యాక కూడా ‘సగం కథ చెప్పాను, ఇంకో సగం చెప్పాలి’ అని మాత్రమే అనుకొన్నా. కథలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమే మాకు రాలేదు. కాకపోతే వాణిజ్య కోణంలో మాత్రం కాస్త ఆలోచించాల్సి వచ్చింది. సినిమాలో వాణిజ్యాంశాలు అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని, అదనపు హంగులు జోడించామంతే.

ఈ చిత్రం షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి?
– రోజూ షూటింగ్‌ అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే మంచి కలలు వచ్చేవి. ఏమైనా తేడాగా అనిపిస్తే భయంతో కలలు వచ్చేవి. మొత్తానికి సెట్లో… కలలో కూడా ‘బాహుబలి’ కథలే. షూటింగ్‌ బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాం.

మీ ఫ్యామిలీ మెంబర్స్‌ ఎలాంటి సపోర్ట్‌ ఇచ్చారు?
– నా చుట్టూ నా కుటుంబం లేకపోతే పిచ్చెక్కిపోయేది. లేదంటే అసలు ఇంత పెద్ద సినిమానే భుజాలపై వేసుకొనేవాడ్ని కాదేమో. వాళ్లే నా బలం, బలగం అయ్యారు. ‘బాహుబలి’ కల నిజం చేసుకోగలిగానంటే ముగ్గురు ప్రధాన కారకులు. ఒకటి నా నిర్మాతలు, రెండోది నా కుటుంబం. మూడోది ప్రభాస్‌. వీరి వల్లే ఈ చిత్రం పూర్తయింది.

‘బాహుబలి’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడానికి కారణాలు ఏమిటి?
– భారీదనం, విజువల్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌… ఒక్కటని కాదు, చాలానే. అన్నిటికంటే ప్రధానమైన కారణం గురించి చెప్పమంటే మాత్రం పాత్రల్లోని బలం. సినిమా చూస్తున్నంతసేపూ మనం పాత్రల్ని ఆస్వాదిస్తుంటే అది మంచి సినిమా అవుతుంది. ఇంటికెళ్లాక కూడా ఆ పాత్రలే గుర్తుకొచ్చాయంటే అది గొప్ప సినిమా అవుతుంది. మా నాన్నగారు గొప్ప పాత్రల్ని స ష్టించారు. నాన్నగారు ఎప్పుడూ ప్రతి పాత్రనీ వాటి తాలూకు నడవడిక, భావోద్వేగాలతో సిద్ధం చేసి వినిపిస్తుంటారు. ఆ పాత్రలన్నీ చెప్పాక వాటి మధ్య ఇలాంటి బంధం ఉంటే బాగుంటుందేమో, వాటిని ఇలా ముడిపెడితే మేలేమో అని ప్రశ్నలుగానే నేను సూచిస్తుంటా.

బాహుబలి వచ్చి రెండేళ్లయింది. ఓ సినిమా కథని ప్రేక్షకులు ఇంతకాలం గుర్తుపెట్టుకొంటారని ఎలా భావించారు?
– నిజానికి రెండేళ్ల విరామం వస్తుందని మేం కూడా అనుకోలేదు. ‘బాహుబలి’ రెండు భాగాల్ని ఒకేసారి తెరకెక్కించి, వెంట వెంటనే విడుదల చేద్దామనుకొన్నాం. కానీ తొలి భాగం పూర్తయ్యేసరికే డబ్బులన్నీ అయిపోయాయి. దాంతో రెండో భాగం ఆలస్యమైంది. ఇదంతా మార్కెటింగ్‌ వ్యూహాలు అనుకొంటున్నారు గానీ, నిజానికి మేమేం ఇది ప్లాన్‌ చేయలేదు. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), పుస్తకాలు, కామిక్స్‌, గేమ్స్‌.. ఇలా ‘బాహుబలి’ని అనేక విధాలుగా మార్కెటింగ్‌ చేశారు, చేస్తున్నారు.

ఇలాంటి భారీ బడ్జెట్‌ సినిమా చేస్తున్నపుడు మీకు భయం కలగలేదా?
– నా మిత్రుడు వినాయక్‌ కూడా ఓ సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అసంపూర్తి కథతో తెలుగులో సినిమా రావడం కొత్త కావొచ్చు కానీ, ఆంగ్లం నుంచి మాత్రం ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’, ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ లాంటి చిత్రాలు వస్తూనే ఉన్నాయి. వాటిని మనం కూడా ఎగబడి చూస్తున్నాం. అందుకే ఆ విషయంలో నాకు భయాలేవీ కలగలేదు.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
– కథని ఆసక్తికరంగా చెప్పడంలో భాగమే అదంతా. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న మాత్రం ఓ మంచి మలుపుగా ఉపయోగపడుతూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందనుకొన్నా. కానీ అది ఓ ఆటంబాంబులా పేలింది. ఒక ప్రశ్న ప్రేక్షకుల నోళ్లల్లో ఇంతగా నానుతుందని అస్సలు వూహించలేదు. అయితే ఆ ప్రశ్నకి సమాధానంగా తీర్చిదిద్దిన సన్నివేశాల విషయంలో మాత్రం ప్రేక్షకులు వందశాతం సంత ప్తి చెందుతారు.

ఈ సినిమాకి ఐదేళ్లు సమయం కేటాయించడం కరెక్టేనా?
– ఈ సినిమాకి ఐదేళ్లు సమయం పడుతుందని వూహించలేదు. రంగంలోకి దిగాకే తెలిసింది. ఇక వెనక్కి తిరిగిరాలేం కదండీ, అందుకే ముందుకు వెళ్లాం. ఈ చిత్రం కోసం మంచి నటీనటులు, మంచి సాంకేతిక బ ందం, మంచి నిర్మాతలు కుదిరారు. అందరం ఒక కుటుంబంలా కలిసిపోయాం. దాంతో ఎప్పుడూ ఈ సినిమా నాకు బరువుగా అనిపించలేదు. షూటింగ్‌ చివరి రోజున ‘హమ్మయ్యా… అయిపోయింది’ అనుకొన్నాం కానీ, పనులన్నీ పూర్తయ్యాక మళ్లీ ఇప్పుడు బాధగా అనిపిస్తోంది. అందరం కలిసి ఇంకొన్ని రోజులు కలిసి ప్రయాణం చేసుంటే బాగుండేదని!

మీరు ఇప్పటిదాకా చేసిన చిత్రాలతో ‘బాహుబలి’ని పోల్చి చూసుకొంటే ఏమనిపిస్తోంది?
– ఒక దర్శకుడుగా ‘బాహుబలి’ నాకు పూర్తి సంత ప్తినిచ్చింది. ఇంతకుముందు చేసిన ప్రతి సినిమాలోనూ కొన్ని పాత్రలపై మాత్రమే ద ష్టి పెట్టినట్టు అనిపించేది. చాలా వరకు కథంతా కథానాయకుడి కోణంలోనే సాగేది. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా కీలకమైనదే. నాకు ఇష్టమైన హీరోయిజాన్ని చూపిస్తూనే, అన్ని కోణాల్లోనూ సంత ప్తికరంగా చిత్రాన్ని తీర్చిదిద్దిన అనుభూతి కలిగింది.

ఈ సినిమాని ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే సాహసం ఎలా చేయగలిగారు? డబ్బులు తిరిగొస్తాయన్న నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది?
– ‘బాహుబలి’కి ముందు సినిమా వసూళ్లు రూ. 80 కోట్లకు అటూ ఇటూగా ఉంది. దాన్ని ఇంకొంచెం ముందుకు తోస్తే రూ.100 కోట్ల వరకూ రాబట్టొచ్చు అనిపించింది. కానీ ‘బాహుబలి’ బడ్జెట్‌ అంతకంటే ఎక్కువ. కాబట్టి ఇతర పరిశ్రమలపై ద ష్టి పెట్టాం. ‘ఈగ’ తమిళంలో బాగా ఆడింది. అక్కడి నుంచి ‘బాహుబలి’కి ఎంతో కొంత వస్తుందన్న నమ్మకం కలిగింది. అది కలుపుకొన్నా మా బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోలేం అనిపించింది. అందుకే ‘బాహుబలి’ని హిందీలోకి కూడా తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చింది. కానీ జనాల్ని థియేటర్లకు రప్పించడం ఎలా? అందుకే కరణ్‌ జోహార్‌తో అనుసంధానమయ్యాం. ఇన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి కాబట్టే బడ్జెట్‌ పెంచుకొంటూ వెళ్లగలిగాం.

‘బాహుబలి: ది బిగినింగ్‌’ బాలీవుడ్‌లో రూ.100 కోట్లు పైగా సాధించింది. ఏ ప్రాంతీయ చిత్రానికీ రానన్ని వసూళ్లు వచ్చాయి. అదెలా సాధ్యమైంది?
– కథలో ఉన్న బలం వల్లే. పైగా సినిమా తీసిన స్థాయి వాళ్లకు నచ్చింది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలకు రెండు రోజుల ముందు ధర్మా ప్రొడక్షన్‌ సీఈఓతో మాట్లాడా. ‘మన సినిమాకి ఎంత రావొచ్చండీ’ అని అడిగా. ‘రోబోకి రూ.18 కోట్లు వచ్చాయి. కాస్త అటూ ఇటూగా ఓ రూ.20 కోట్ల వరకూ రావొచ్చు’ అన్నారు. రూ.100 కోట్లన్నది మనమే కాదు, వాళ్లూ వూహించలేదు.

ప్రాంతీయ చిత్రాలంటే ఉత్తరాది వాళ్లకు చిన్నచూపు అంటుంటారు. దీనికి మీ సమాధానం?
– ఈ వ్యాఖ్య పూర్తిగా నిజం కాదు. మనం కూడా అక్కడి నుంచి వస్తున్న ప్రతి సినిమానీ హిట్‌ చేయడం లేదు కదా? తెలుగులో మార్కెట్‌ కావాలనుకొంటే వాళ్లు ఇక్కడికి వచ్చి, పబ్లిసిటీ పెంచి నానా రకాలుగా కష్టపడతారు. అలా వాళ్ల సినిమాలు మనకు అలవాటయ్యాయి. అలా మనం వెళ్లి చేసింది లేదు. ‘శివ’ తరవాత హిందీలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఒకప్పుడు విజయశాంతిగారి సినిమాలు తమిళంలో బాగా ఆడేవి. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్‌ చిత్రాలు నేరుగా విడుదలై బాగా ఆడాయి. మనం ఆ మార్కెట్‌ ని నిలుపుకోలేకపోయాం. కథ బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. ‘ఈగ’ కథని బాగా నమ్మాను. తమిళంలో బాగా ఆడింది. మలయాళంలోనూ మంచి విజయం సాధించింది. బాలీవుడ్‌లో మాత్రం సరిగా వర్కవుట్‌ కాలేదు. ‘ఈగ’ ఆడలేదు కదా, అని ‘బాహుబలి’ని అక్కడ విడుదల చేయకపోతే ఈ స్థాయి వసూళ్లు దక్కేవి కావు.

మిమ్మల్ని స్పీల్‌బర్గ్‌తో పోలుస్తుంటారు, అందరు హీరోలు రాజమౌళితో పనిచేయాలని ఉంది అంటుంటారు. ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది?
– స్పీల్‌బర్గ్‌తో పోల్చకండి. జనాలేవో అభిమానంతో ఏదోటి అనేస్తారు. ఇక బాలీవుడ్‌ కథానాయకుల మాటంటారా? దర్శకుడిగా నా ఫార్ములా ఒక్కటే. నాకు నచ్చిన కథ ఎంపిక చేసుకొంటా. దానికి తగిన నటీనటులతోనే చేస్తా. కాబట్టి ఇవన్నీ నాపై ఒత్తిడి తీసుకురావు. నాకు వారికి ఉన్న ఫ్రెండ్లీ నేచర్‌తో సినిమాలు చేస్తుంటాను.

మీరు రాసుకున్న కథను వంద శాతం తెరపై చూపించగలిగానని అనుకుంటున్నారా?
– ఏ దర్శకుడు తన మస్తిష్కంలో ఉన్న ఆలోచనలను పరిపూర్ణంగా తెరపై ఆవిష్కరించలేడు. అది ఎవరికి సాధ్యం కాదు. మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవంగా వాటిని తెరపై చూపించే విషయంలో హీరోలు, బడ్జెట్‌, డేట్స్‌.. ఇలా పలు అంశాల ప్రభావం వాటిపై ఉంటుంది. ఆ పరిధిలను ద ష్టిలో పెట్టుకునే మనం అనుకున్న అంశాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేయాలి. బాహుబలి-2 విషయంలో నా మనసులో ఉన్న కథను దాదాపు చూపించానని అనుకుంటున్నాను.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఎలా అనిపిస్తుంది?
– తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమ అంటూ ఒకటుందని ప్రపంచంలో చాలా దేశాల వారికి తెలియదు. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ అసలైన భారతీయ సినిమా అంటే బాహుబలి అని చెప్పుకునే స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లినందుకు గర్వపడుతున్నాను.

ఇంతటి భారీ చిత్రాన్ని రూపొందించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేవి?
– నిర్మాతలు, ప్రభాస్‌తో పాటు కుటుంబ ప్రోత్సాహంతోనే ఈ సినిమా పూర్తి చేయగలిగాను. నన్ను, నా కథను, ప్రతిభను నమ్మి వారి జీవితాల్ని రిస్క్‌లో పెట్టి మరో ఆలోచన లేకుండా నిర్మాతలు ముందుకు వచ్చారు. మా కుటుంబం నన్ను ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడింది. నేను కన్న కలను సాకారం చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. కుటుంబం లేనిదే నేను లేను. అలాగే ప్రభాస్‌ సినిమాను పెద్ద స్థాయిలో నిలబెట్టడం కోసం చాలా కష్టపడ్డాడు.

పాత్రల విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు?
– ‘బాహుబలి’లోని పాత్రలనన్నింటినీ షూటింగ్‌కి ముందే డిజైన్‌ చేయించాం. అంటే నలుగురైదుగురు ఉండే బ ందం మమ్మల్ని ప్రతి పాత్ర గురించీ ఐదొందలు, ఆరొందల ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికీ మేం జవాబులివ్వాలి. రచయితగా మా నాన్నగారికీ, దర్శకుడిగా నాకూ ఆ పాత్రల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆ కేరక్టర్స్‌ డిజైనింగ్‌లో ప్రభాస్‌ కూడా కూర్చున్నాడు. తన పాత్రల గురించిన విషయాలన్నింటినీ రాసుకుంటూ ఉండేవాడు. డిబేట్‌లో తను కూడా పాల్గొనేవాడు. దాంతో ఆ పాత్రల గురించి, వాళ్లెప్పుడు ఏం చేస్తారనేది కంప్లీట్‌గా మైండ్‌లో ముద్రించుకుపోయింది. ఏ యాక్టర్‌ ఏ సందేహం వ్యక్తం చేసినా, సమాధానం చెప్పగలిగేవాళ్లం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.