కథ :

మహానగరంలో నలుగురి (సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, చార్లీ ) జీవితాలు ఒకరితో ఒకరికి తెలీకుండానే ఎలా ముడిపడ్డాయి , ఒక్క రోజులో జరిగిన సంఘటనల వల్ల తలకిందులైపోయిన వాళ్ళ జీవితాలు చివరికి ఏమయ్యాయి అనేదే ‘నగరం’

నటన :

ఆవేశం నిండిన పాత్రలో రఫ్ గా కనిపిస్తూనే తన పక్కన వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో సందీప్ కిషన్ చాలా బాగా చేశారు. ‘ప్రస్థానం’ తర్వాత అంతటి ఇంటెన్సిటీ చూపించారు. రెజీనా అందంగా కనిపిస్తూనే పైకి సందీప్ కిషన్ ప్రేమని తిరస్కరిస్తూ లోపల తన కోసం తపన పడే పాత్రలో చక్కగా అభినయించారు. అమాయకంగా కనిపిస్తూ పరిస్థితుల వల్ల చివరికి తిరగబడే పాత్రలో శ్రీ మెప్పిస్తారు.

ఇతర పాత్రల్లో చార్లీ, రామదాస్, మధుసూదన్ బాగా సరిపోయారు. పాత్రలకి సరిపోయే నటులు వారి నటన సినిమాకి మరో ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు.

బలాలు :

ఉత్కంఠ రేపే కథనం, దర్శకత్వం
నటన
నేపధ్య సంగీతం
నిర్మాణ విలువలు

బలహీనతలు :

నిడివి తగ్గించుంటే మరింత  బావుండేది

విశ్లేషణ :

మొదటి సినిమానే ఇంతటి సంక్లిష్టమైన కథనం తో కూడిన స్క్రిప్ట్ ని ఎంచుకున్న దర్శకుడు లోకేష్ ని అభినందించాల్సిందే. టైటిల్స్ సీక్వెన్స్ నుండే దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సినిమా అంతటా ఉత్కంఠ సడలకుండా కథనాన్ని నడిపిన తీరు దర్శకుడికి తన కథ మీదున్న పట్టు ని చూపిస్తుంది. తర్వాత ఎం జరుగుతుందో అనే ఆసక్తి సినిమా అంతా ఉండేలా చూసుకున్నాడు. థ్రిల్లింగ్ గ ఉంటూనే దానికి ఎమోషన్స్ ని జత చేసిన విధానం బాగా పని చేసింది. ఆద్యంతం ఉత్కంఠతతో సాగే కధనంలో వచ్చే పాటలు కాస్త ఇబ్బంది పెడ్తాయ్. ఇలాంటి కథని ఎంచుకున్నప్పుడు నిడివి తక్కువుండేలా చూస్కుంటే మరింత బావుంటుంది.

జావేద్ రియాజ్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకే హైలైట్స్ లో ఒకటి. సన్నివేశాలు మరింత బాగా రావడానికి ఉపయోగపడింది. సెల్వ కుమార్ కెమెరా పనితనం, ఫిలోమిన్ ఎడిటింగ్ పనితనం చాలా బాగున్నాయి. టెక్నికల్ గా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. నిర్మాతలు అశ్విని కుమార్, డ్రీం వారియర్ పిక్చర్స్, పొటెన్షియల్ స్టూడియోస్ రాజి పడని నిర్మాణ విలువలు తేరా మీద కనిపిస్తాయి. నూతన దర్శకుడిని నమ్మి ఇలాంటి కొత్త తరహా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు అభిరుచిని ప్రశంసించాల్సిందే.

బాటమ్-లైన్ : ఆకట్టుకునే థ్రిల్లర్
రేటింగ్ : 3 . 5 / 5