‘ఓం నమో వెంకటేశాయ’ రివ్యూ

0
483

రెండు దశాబ్దాల క్రితం ‘అన్నమయ్య’ తో భక్తి చిత్రాలకి పునః ప్రతిష్ట చేసిన అక్కినేని నాగార్జున – రాఘవేంద్ర రావు ల ద్వయం ఆ ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని’ కథ తో మళ్ళీ ‘ఓం నమో వెంకటేశాయ’ తో వచ్చారు

కథ :

బాల్యం నుంచే ఆ దేవా దేవుని అన్వేషిస్తూ గురువు సలహా ని అనుసరించి తపస్సు చేసే రామ (అక్కినేని నాగార్జున) కి బాలకుని రూపంలో ఆ దేవదేవుడు ప్రత్యక్షమైనా గుర్తించక వెళ్ళిపోమంటాడు. ఇంటికి తిరిగెళ్లిన రామ కి తన మరదలి (ప్రజ్ఞ ) తో వివాహం నిశ్చయిస్తారు. వివాహానికి సుముఖంగా లేనని తన మనసులో ఆ భగవంతుడే కొలువై ఉన్నాడని చెప్పి దైవాన్వేషణలో తిరుమల కి చేరుకుంటాడు రామ. అక్కడ ఆ వేంకటేశుని భక్తురాలైన కృష్ణమ్మ (అనుష్క ) ఆశ్రమంలో ఉంటూ తిరుమల లో స్వామి వారికి జరగాల్సిన సేవలని క్రమబద్ధీకరిస్తాడు. భక్తులకి తిరుమల ప్రశస్తి గురించి వివరిస్తూ అహర్నిశలూ ఆ స్వామి వారి సేవలోనే గడుపుతాడు. తన మీద రామ చూపిస్తున్న భక్తి, ప్రేమ లకి పరవశించి శ్రీనివాసుడు రామ కి నిజ రూప దర్శనం ప్రసాదించడమే కాక అప్పుడప్పుడు పాచికలు కూడా ఆడుతుంటాడు. ఇలా దేవునితోనే సాన్నిహిత్యం పొందిన రామ హాతి రామ్ బావాజీ గా ఎలా ప్రసిద్ధికి ఎక్కారు ? చివరికి సజీవ సమాధిగా ఎలా మారారు ? అన్నదే చిత్ర కథ

నటన :

భక్తి రస చిత్రాలకి, నాగార్జున కి అవినాభావ సంబంధం ఉంది. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ లో భక్తునిగా జీవించారు ఆయన. ‘ఓం నమో వెంకటేశాయ’ లో మరింత పరిణితి చెందిన నటనతో మెప్పిస్తారు ఆయన. ‘సోగ్గాడే’ గా అలరించిన ఆయనలోని ‘స్టార్’ ఇసుమంతైనా కనిపించలేదంటే ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పాత్ర చేసారో అర్ధం చేసుకోవచ్చు.

నాగార్జున ని భక్తునిగా ఇంతక ముందు రెండు సినిమాల్లో చూసినప్పటికీ, ఈ చిత్రం లో ఆయన హావభావాల్లో చూపించిన వైరుధ్యాలు నటునిగా ఆయన ఎంత పరిణితి చెందారో చూపిస్తుంది. స్వామి ని చూడలేనప్పుడు నిస్సహాయత , రావు రమేష్ భక్తులకి చేసే అన్యాయం చూసినప్పుడు చూపించే రౌద్రం, స్వామి వారితో ఉన్నప్పుడు కళ్ళతోనే పలికించిన భక్తి, ఆర్ద్రత తో తనలోని నటుడిని ఎంతో ఉన్నతంగా ఉన్నతంగా ఆవిష్కరించారు నాగార్జున. ఇందులో ఒక చోట సాక్షాత్తు శ్రీవారే ‘భగవంతుని కంటే భక్తుడే గొప్ప’ అంటారు. ఆ మాట ప్రకారమే చెప్పుకుంటే దేవుని సినిమాకి పరిపూర్ణత లభించాలంటే నాగార్జునే భక్తుడు అవ్వాలి అనే స్థాయిలో అభినయించారు.

కృష్ణమ్మ పాత్రలో అనుష్క సాత్వికంగా కనిపిస్తారు. సినిమా అంతా హాతి రామ్ కి సహాయకారిగా ఉండే సన్యాసిని పాత్రలో అనుష్క అమరిపోయారు. నాగార్జున తర్వాత చెప్పుకోవాల్సింది వెంకటేశునిగా చేసిన సౌరభ్ జైన్ గురించి. హిందీ సీరియల్స్ లో కూడా దేవునిగా చేసిన అనుభవం వల్లనేమో సౌరభ్ అందంగా కనిపించటమే కాకుండా శారీరక భాష తో కూడా శ్రీనివాసునిగా చక్కగా సరిపోయారు. ప్రజ్ఞ జైస్వాల్ కాసేపే అయినా రాఘవేంద్ర రావు మార్క్ పాటలో అందంగా కనిపించింది. రావు రమేష్, సాయి కుమార్, సంపత్, బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.

బలాలు :

అక్కినేని నాగార్జున
రాఘవేంద్ర రావు దర్శకత్వం
కీరవాణి సంగీతం
భావంతునికి భక్తునికి మధ్య సన్నివేశాలు
నాణ్యమైన నిర్మాణ విలువలు

బలహీనతలు :

అక్కడక్కడా నెమ్మదించే కథనం

విశ్లేషణ :

శత చిత్ర దర్శకునిగా తనకి ఉన్న అనుభవం రాఘవేంద్ర రావు ప్రతి ఫ్రేమ్ లో చూపించారు. తిరుమల స్థల ప్రాశస్త్యం గురించి కానీ, దేవునికి చేసే సేవల గురించి కానీ వివరించేందుకు పాటలని ఉపయోగించిన తీరు ఇలాంటి సినిమాల మీద ఆయనకీ ఉన్న పట్టు ఎలాంటిదో చూపిస్తుంది. గత చిత్రాల్లో కీరవాణి తో కలిసి అయన చేసిన మాయ ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది.

ఇక రెండవ అర్ధ భాగానికి వచ్చే సరికి దేవునికి భక్తునికి మధ్య సన్నివేశాలతో మరింత రక్తి కట్టించారు. ఈ సన్నివేశాలే సినిమాకి ఆయువు పట్టని చెప్పొచ్చు. పతాక సన్నివేశాల్లో ఆ దేవదేవుడే ఆగిపొమ్మంటూ భక్తుని ఆపాలని చేసే ప్రయత్నం, అప్పుడు పలికించిన భావోద్వేగాలకు కళ్ళు చెమర్చకుండా ఉండవు. భక్తి రస చిత్రాలని ఎలా తీయాలో ‘ఓం నమో వెంకటేశాయ’ తో మరో మారు చూపించారు దర్శకేంద్రుడు.

ఎం.ఎం కీరవాణి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొన్ని సన్నివేశాలని తన నేపధ్య సంగీతం తోనే మరో స్థాయికి తీసుకెళ్లారు ఆయన. భగవంతుని చూస్తున్నప్పుడు భక్తునిగా నాగార్జున ఎంత ఆర్ద్రత ప్రదర్శించారో ఆయన భావోగ్వేదాన్ని కీరవాణి హృదయానికి హత్తుకునేలా వినిపించారు. ఈ సినిమాకి మరో మూల స్థంభం కీరవాణి సంగీతం. ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది. తిరుమల కొండల్లోని ఆహ్లాద పరిచే వాతావరణాన్ని అద్భుతంగా తెరకెక్కించారు ఆయన. ప్రతి ఫ్రేమ్ అందంగా ఎంతో నాణ్యతతో తీశారు.

నిర్మాతగా ఏ. మహేష్ రెడ్డి అభినందనీయుడు. భక్తి సినిమాలు ఎంతో రిస్క్ తో కూడుకున్నవి. అయినా ఎక్కడా రాజి పడకుండా వ్యయప్రయాసల కి ఓర్చి ఎంతో ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఆయన ధైర్యాన్ని అభినందించాల్సిందే.

అలరించే భక్తునికి భగవంతునికి మధ్య జరిగిన లీలా వినోదం
రేటింగ్  : 3.75 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here