కథ :
అన్నిటి కంటే ఆటిట్యూడ్ మెయింటైన్ చేయడమే ముఖ్యం అని నమ్మే లోకల్ కుర్రోడు బాబు (నాని). ఒక రోజు అనుకోకుండా బాబు, కీర్తి (కీర్తి సురేష్) ని చూడటం, తొలి చూపులోనే ప్రేమలో పడటం జరిగిపోతాయ్.కీర్తి ని కూడా ఎలాగైనా తనని ప్రేమించేట్లు చేసుకోవాలని కీర్తి ని ‘డిస్టర్బ్’ చేసే ప్రయత్నాల్లో ఉంటాడు బాబు. తన తండ్రి మీద అపారమైన అభిమానం ఉన్న కీర్తి, తండ్రి చెప్పినవాణ్ణే పెళ్లి చేసుకుంటాను అని బాబు ని దూరం పెడుతూ వస్తుండగా అనుకోకుండానే బాబు తో ప్రేమలో పడుతుంది. అయితే కీర్తి తండ్రి కీర్తికి సిద్ధార్థ్ వర్మ (నవీన్ చంద్ర) తో పెళ్లి నిశ్చయించడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. బాబు కీర్తి కలిసారా ? కీర్తి తండ్రి ని బాబు ఎలా ఒప్పించగలిగాడు ? అనేది ‘నేను లోకల్’

నటన :

సినిమా సినిమాకీ తన నటన పరిధి ని పెంచుకుంటూ వెళ్తున్న నాని ‘నేను లోకల్’ తో కూడా అది కొనసాగించారు. పక్కింటి కుర్రోడిలా కనిపిస్తూ మనలో ఒకడు అనిపించేలా ఉండడం నాని ప్రధాన బలం. ఆ బలాన్నిసరిగ్గా ఉపయోగించుకుంటూ తన నటన తో ఎలాంటి పాత్రనైనా కాన్ఫిడెంట్ గా పండించేస్తున్నారు. ‘నేను లోకల్ ‘ కమర్షియల్ అంశాలతో కలిపిన ఎనర్జిటిక్ పాత్రలో కనిపించి మెప్పించారు. కామెడీ సీన్స్ లో తన టైమింగ్ తో నాని అక్కట్టుకున్నారు.

హోమ్లీ లుక్స్ తో పొందిగ్గా కనిపించే కీర్తి సురేష్ నటన పరంగా కూడా మెప్పించారు. తండ్రి కి ఇచ్చిన మాటకి ప్రేమించిన వాడికి మధ్య నలిగిపోయే పాత్రలో ఎమోషనల్ సీన్స్ లో చక్కని అభినయం కనబరిచారు. కీలక పాత్రలో పోలీస్ గా నవీన్ చంద్ర సరిపోయారు. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని, సచిన్ ఖేద్కర్, రావు రమేష్ తమ అనుభవాన్ని ప్రదర్శించారు.

బలాలు :

నాని
నాని – కీర్తి ల మధ్య కెమిస్ట్రీ
ఫస్ట్ హాఫ్ లో వినోదం
డైలాగ్స్

బలహీనతలు :

రెగ్యులర్ కథ
అక్కడక్కడా తేలిపోయిన సెకండ్ హాఫ్

విశ్లేషణ :

కథ పరంగా ‘నేను లోకల్’ లో కొత్తదనమేమి లేకపోయినా వినోదాత్మకంగా చెప్పిన తీరు ఈ సినిమాని నిలబెట్టింది. దానికి తోడు నాని అభినయం ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. మొదటి అర్ధ భాగం అంతా నాని-కీర్తి ల మధ్య టీసింగ్ రొమాన్స్ సన్నివేశాల తోనే ఉంటుంది. ఈ సన్నివేశాలలో వినోదం మిళితం చేయడంలో దర్శకుడు త్రినాథ రావు రచయిత ప్రసన్న కుమార్ సక్సెస్ అయ్యారు. వినోదాత్మకమైన ఫస్ట్ హాఫ్ సినిమాకీ ప్రధాన బలం.

ఇక కథ మొదలయ్యే సెకండ్ హాఫ్ లో డ్రామా, ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నారు. ఈ రెండో అర్ధ భాగం చాల సార్లు చూసినట్టు అనిపించినా మంచి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ లో నాని అభినయం మరో సరి అతను ఎంత మంచి నటుడో చూపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గత చిత్రాల మాదిరిగానే ప్రొడ్యూసర్ శిరీష్ మంచి నిర్మాణ విలువలతో క్వాలిటీ సినిమాని అందించారు.

‘నేను లోకల్’ వినోదాన్ని అందించే కమర్షియల్ ప్యాకేజ్. ఆకట్టుకునే పాటలు, వినోదం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కలిసి ‘నేను లోకల్’ ని ప్రేక్షకులకి దగ్గిర చేస్తుంది. వరుస విజయాల్లో ఉన్న నాని కి మరో విజయం.

వినోదాత్మక ప్రేమ కథ

రేటింగ్ : 3.25 /5