అంధుడైన జయరాం (మోహన్ లాల్) ఒక అపార్టుమెంట్ సముదాయంలో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తుంటాడు. జయరాం కి అంధత్వం ఉన్నా శబ్దాలని,వాసనని అనుసరించి వ్యక్తులని,పరిసరాల్ని గుర్తించే నైపుణ్యం ఉంటుంది.నిజాయితీగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా మెలిగే అతని గుణం అదే అపార్టుమెంట్లో ఉండే రిటైర్డ్ జడ్జి కృష్ణ మూర్తి కి జయరాం ని ఆత్మీయుడిని చేస్తుంది. కృష్ణ మూర్తి తన జీవితంలో ని రహస్యాలని జయరాం తో పంచుకుని, ఎవరికీ తెలీకుండా దూరంగా ఊటీలో ఉంచి చదివిస్తున్న నందిని అనే పదేళ్ల పాప కి రక్షకుడిగా జయరాం ని ఉండమని కోరతాడు. ఇంతలో కృష్ణ మూర్తి హత్య చేయబడతాడు. కృష్ణ మూర్తిని చంపింది వాసు (సముద్రఖని) అని అతను నందిని ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న జయరాం అతనిని ఎలా ఆపాడు ? నందిని ని కాపాడుకున్నాడా లేదా ? అసలు వాసు ఎవరు ? అనే ప్రశ్నలకి సమాధానమే ‘కనుపాప’

నటన :

‘కనుపాప’ నిస్సందేహంగా మోహన్ లాల్ సినిమా. అతని కోసమే చూడాల్సిన సినిమా. అంధుడి పాత్రలో మోహన్ లాల్ తన నటనా కౌశలాన్ని మరో సారి చూపించారు. సినిమా మొత్తాన్ని తానె అయ్యి నడిపించారు.

హంతకుడి పాత్రలో సముద్రఖని చూడ్డానికి నప్పినా, నటన పరంగా అతనికి పెద్దగా అవకాశం లేదు. ఇక మిగిలిన పాత్రల్లో నందిని గ చేసిన బేబీ మీనాక్షి ఆకట్టుకుంటుంది. నేదుమూడి వేణు, విమల రామన్ పాత్రలకి సరిపోయారు.

బలాలు :

మోహన్ లాల్
ఉత్కంఠ భరితమైన కథనం
హీరో విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్స్

బలహీనతలు :

అక్కడక్కడా నెమ్మదించే కథనం

విశ్లేషణ :

సినిమా ఒక సాధారణ కుటుంబ డ్రామా గా మొదలై మిస్టరీ, థ్రిల్లర్ గా మారుతుంది. దర్శకుడు ప్రియదర్శన్ తాను రాసుకున్న ఉత్కంఠ భరితమైన కథనం తో కథ ఎక్కడా పక్కదోవ పట్టకుండా ఆద్యంతం ఆసక్తి కరంగా ఉంచడంలో సక్సెస్ అయ్యారు. దీనికి మోహన్ లాల్ తన అద్భుత నటన తో ప్రాణం పోశారు. కాకపోతే హత్యల గురించి పోలీసులు చేసే విచారణ మరింత ఆసక్తికరంగా ఉండుంటే బావుండేది.

రెండో అర్ధభాగంలో విలన్ ఎవరో తెలిసిపోయాక అతని తర్వాతి లక్ష్యం ఎవరో తెలిసాక కూడా మోహన్ లాల్ కి అతనికి మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఉత్కంఠ సడలనివ్వకుండా కాపాడాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మోహన్ లాల్ తో నేరాన్ని అంగీకరింపచేసేందుకు పోలీసులు ప్రయత్నించే సన్నివేశం మోహన్ లాల్ ని ‘కంప్లీట్ ఆక్టర్’ అని ఎందుకు అంటారు అనేదానికి మరో ఉదాహరణగా నిలుస్తుంది. ప్రీ-క్లైమాక్స్ లో కథనం కాస్త నెమ్మదించినా క్లైమాక్స్, అప్పుడు వచ్చే ట్విస్ట్ తో అది పెద్ద కంప్లైంట్ అనిపించదు. తెలుగు అనువాదం బాగా కుదిరింది.

ఉత్కంఠరేపే సస్పెన్స్ థ్రిల్లర్
రేటింగ్ : 3 / 5