జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీ పి.ఆర్‌.వోగా, సూపర్‌హిట్‌ పత్రికాధినేతగా, ఆర్‌.జె.సినిమాస్ అనే బ్యాన‌ర్‌పై స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత‌గా తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్‌ చేసుకున్న బి.ఎ.రాజు పుట్టినరోజు జనవరి 7. తన పుట్టినరోజు సందర్భంగా ఇండ‌స్ట్రీ హిట్ వెబ్ సైట్ తెలుగు వెర్ష‌న్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ –

”సూపర్‌హిట్‌ స్టార్ట్‌ చేసి 24 సంవత్సరాలవుతుంది. అలాగే నిర్మాతగా కూడా పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. 2018లో సూప‌ర్‌హిట్ 25 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుక‌న్న త‌ర్వాత సూపర్‌హిట్‌ 25 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. ఇన్ని ఏళ్లుగా పనిచేస్తున్న నాకు రెండు, మూడేళ్ళే అవుతున్నట్లుగా ఉంటుంది. అందుకు కారణం నేను చేసిన పనిని చాలా ఇష్టంతో చేయడమే అందుకు కారణం. ప్రతిరోజూ పనిచేయడమే నా పాలసీ. ఇంకా ఎనర్జీతో పనిచేయాలనుకుంటూ ఉంటాను. అలాగే పి.ఆర్‌.ఓగా అందరి స్టార్స్‌ సినిమాలకు పనిచేశాను. నిర్మాతగా మారిన తర్వాత సినిమాలోని కథకు న్యాయం చేస్తూ కథను కథగా తీయాలని ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు మా ఆర్‌.జె.సినిమాస్ బ్యాన‌ర్‌పై నిర్మాతగా వైశాఖం సినిమాను నిర్మించాం. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన ప్రేమ‌లో పావ‌ని క‌ల్యాణ్‌, చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ చిత్రాలు బ‌య్య‌ర్స్‌కు లాభాల‌ను తెచ్చిపెట్టాయి. అందువ‌ల్ల మా వైశాఖం సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ నెల‌కొంది.వైశాఖం విడుదల కంటే ముందుగానే మరో సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాము.అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరగుతున్నాయి. మా ఆర్‌.జె.సినిమాస్ బ్యానర్‌లో వచ్చిన చిత్రాలన్నింటిలో వైశాఖం బెస్ట్‌ మూవీ అవుతుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. 2017లో వైశాఖం సినిమా డెఫ‌నెట్‌గా పెద్ద స‌క్సెస్ అవుతుంది. నా సక్సెస్‌ కారణం నా సతీమణి, డైరెక్టర్‌ బి.జయగారి స‌పోర్ట్ ఎంతో ఉంది. సూప‌ర్‌హిట్‌, ఇండ‌స్ట్రీ హిట్ స‌క్సెస్ కావ‌డానికి నా స్టాఫ్ స‌పోర్ట్ ఎంతో ఉంది. నా జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు” అన్నారు.